బడా బాబుల రిజర్వేషన్ ల దోపిడీ

మా వూరిలో కొండయ్య, గోపాలం అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు, చిన్నప్పట్నించీ వాళ్ళ కుటుంబాలు నాకు బాగా తెలుసు. ఇద్దరివీ బాగా బీద కుటుంబాలే. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. కొండయ్య తండ్రి అడవి లో నుండి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మేవాడు, చాలా కష్టమైన పని. అలా కష్టాలతోనే చదువుకుని రిజర్వేషన్ దయవలన కొండయ్య ఇంజనీర్ కాగలిగాడు, మళ్ళీ జాబు లో రిజర్వేషన్ వలన త్వరగా promotions వొచ్చి ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో పని చేస్తున్నాడు. రిజర్వేషన్స్ ఎంత మేలు చేసాయో అన్పించింది ఇతనిని చూస్తే …. తన కొడుకు అవినాష్ ని చిన్నప్పట్నించీ మంచి ఇంటర్నేషనల్ ప్రైవేటు స్కూల్స్ లో చదివించాడు. ఇప్పుడు అవినాష్ సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్స్ వలన IFS సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఈ కుటుంబం ఎవరూ మా వూరి ముఖం కుడా చూడలేదు, హైదరాబాద్ లో జూబిలీ హిల్స్ లో పెద్ద విల్లా లో ఉంటున్నారని తెలుసు…అదీ కొండయ్య కుటుంబ ప్రగతి….
ఇక గోపాలం సంగతి చూద్దాం….గోపాలం తండ్రి చెప్పులు కుట్టుకునే వాడు మా వూరి సెంటర్ లో, తనకి ఆరోగ్యం సహకరించకపోవటం వలన గోపాలం కుడా కుటుంబాన్ని పోషించటం కోసం తన తండ్రికి, అలాగే తన చదువుకి కూడా విశ్రాంతి ఇచ్చి చెప్పులు కుడుతూ ఉండిపోయాడు. కానీ కళ్ళ ముందే తన మిత్రుడు కొండయ్య రిజర్వేషన్స్ తో చదువుకోవటం, అతని కుటుంబం అంతా ఇప్పుడు హైదరాబాద్ లో హాయి గా వుండటం చూసి, తన చమటోడ్చి ఒక్కగానొక్క కొడుకు రాజయ్య ని బాగానే చదివించాడు. నేను కూడా ఎక్కువ కాదు గానీ ఒక 5000 రూపాయల ఆర్ధిక సాయం చేసా. మొత్తానికి రాజయ్య కూడా బాగానే కస్టపడి చదివి అవినాష్ తో పాటు సివిల్స్ ఇంటర్వ్యూ కి వెళ్ళాడు గానీ ఆ సామాజిక వర్గ కోటా లో ఆఖరు గా మిగిలింది అవినాష్ తన్నుకుపోయాడు, రాజయ్యకి ఏమీ రాలేదు. ఆ మధ్య రోడ్ మీద వెళ్తూ చూస్తే రాజయ్య వాళ్ళ చిన్న చెప్పుల దుకాణం లో షూస్ పాలిష్ చేస్తూ కనిపించాడు. గుండెల్లో చివుక్కుమని అన్పించి ఉండబట్టలేక వెళ్లి అడిగా ఏమయ్యింది నీ సివిల్స్ ఇంటర్వ్యూ అని, రాలేదు సార్, మా category లో ఆఖరు సీట్ అవినాష్ కి వచ్చింది, next నేనే సార్, వాడు అడ్డు లేకపోతే నాకు వచ్చి ఉండేది అని అంటూ షూస్ పోలిష్ చెయ్యాలా సార్ అంటూ ఇంకా ఏదో అడుగుతున్నాడు…నాకు కళ్ళు బైర్లు కమ్మి కాళ్ళ కింద నేల కదులుతున్నట్టు అన్పించింది…రిజర్వేషన్స్ ఎత్తేయ్యమని నేను అనట్లేదు, కానీ ఒక category లో బాగా బలిసిన వాడికి కూడా రిజర్వేషన్స్ ఇంకా వర్తిమ్పచెయ్యటం వలన అదే category లో బీద వాడు నష్టపోవటం ఎంత వరకు కరెక్ట్??? అయినా తెగ బలిసి, కార్లలో తిరిగి, duplex లో విల్లాస్ లో నివసిస్తూ కార్పొరేట్ స్కూల్స్ లో చదివే ఇంజనీర్ ల పిల్లలకి, డాక్టర్ ల పిల్లలకి, లాయర్ ల పిల్లలకి, businessmen ల పిల్లలకి, రాజకీయ నాయకుల పిల్లలకి మళ్ళీ రిజర్వేషన్స్ ఇవ్వటం కంటే దారుణ మైన దోపిడీ ఇంకోటి ఉంటుందా.. మన దేశం లో తప్ప ప్రపంచం లో ఇంకెక్కడైనా వుందా ఇలాంటి విడ్డూరం…ఆలోచించండి…

అవి కాదు సార్ మాకు కావలసినవి !

                                 14 సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే మళ్ళీ చెన్నై వెళ్ళా …. అలాగే వుంది … ఏమీ మార్పు కనపడలేదు. పార్క్ స్టేషన్ నుండి లోకల్ ట్రైన్ లో వేలచేరి వెళ్ళా, 45 నిమిషాల ప్రయాణం, ఆ 45 నిమిషాలు మురికి కాలువల కంపు వెంటాడుతూనే వుంది, వర్షం పడుతోంది. స్టేషన్ లో దిగి టాక్సీ ఎక్కా. మెయిన్ రోడ్ ఎక్కగానే ట్రాఫిక్ జాం, మోకాలి లోతు నీళ్ళున్నాయి రోడ్డు మీద. లెఫ్ట్ సైడ్ చూస్తే మల్టీప్లెక్స్, రైట్ సైడ్ చూస్తే పెద్ద రిలయన్స్ షాపింగ్ మాల్ కనపడుతున్నాయి. మెల్లగా 2 KM దూరం 2 గంటల్లో చేరుకున్నా, దిగి నడిచి వెలిపోధామంటే కాళ్ళు మోపలేము. ఫ్రెండ్ అపార్ట్ మెంట్ కి వెళ్లేసరికి ఫ్యాన్ తిరుగుతోంది గానీ టీవీ రావటం లే. ఎందుకురా అంటే 3 గంటల నుండి కరెంటు లేదు, inverter, వచ్చేస్తాదిలేరా అన్నాడు. ఫ్రెష్ అవటానికి బాత్ రూం లోకి వెళుతుంటే స్నానం రేపు పొద్దున్న నీళ్ళు వచ్చినప్పుడు చేద్దువు గానీ ఇప్పుడు 2 మగ్గుల తో ముఖం కడుక్కోమన్నాడు. ఎలాగోలా చెన్నై లో నా పని ముగించుకుని చార్మినార్ express లో హైదరాబాద్ బయలుదేరా. ఒక పెద్దాయన HPCL లో రిటైర్డ్ మేనేజర్ ట్రైన్ లో మాటలు కలిపారు నాతో. మాటలలో నేను అన్నాను మీకేంటి సార్ త్వరలో బుల్లెట్ ట్రైన్స్ విత్ అల్ facilities like ఇంటర్నెట్, WiFi వస్తున్నాయి అని. వాటి సంగతి దేవుడెరుగు సార్, మాకు కరెంటు, నీళ్ళు సరిగ్గా ఇమ్మనండి సార్… దోమలు, కంపు, దరిద్రం లేకుండా మురికి కాలువలు సరిగ్గా వెయ్యమనండి సార్, దశాబ్దాలుగా ఇలాంటి basic facilities కూడా చెయ్య లేకుండా బుల్లెట్ లు, WiFi లు మాకు ఎందుకు సార్ అని తన బెర్త్ మీద వాలిపోయాడు. నేను బెర్త్ మీద చేరబడ్డాను గానీ చాలా సేపు నాకు నిద్ర పట్టలేదు, నెల రోజులు దాటిపోయినా అతని మాటలు ఇంకా నా చెవి లో మార్మోగుతూనే వున్నాయి….ఇప్పటికి కూడా ఎక్కడో దూరం గా ట్రైన్ కూత వినపడినా కూడా ఆ జ్ఞాపాకాలే గుర్తు వస్తున్నాయి…